Wednesday, February 4, 2009

ఎవరైనా ఎదురు చూసే వాళ్ళుంటే, ఒక నోటీసు :


ఈ బ్లాగును ఇక శాశ్వతంగా మూసేస్తున్నాను. కారణాలు ఏవైనా ఇక ఇక్కడ నేను రాయలేను. వెళ్ళిపోయే ముందు కొంత చెప్పాలనుకుంటున్నాను:

నేను ఇంతవరకూ ఎప్పుడూ ఈ బ్లాగు నాకు పెద్ద ముఖ్యం కాదన్నట్టే బిల్డప్ ఇచ్చాను. కాని అది నిజం కాదు. ఈ బ్లాగు మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఇది నాకు చాలా ముఖ్యం. ఒక రకంగా లైఫ్‌లైన్ లాంటిది. లేకపోతే ఏ కాజువల్ బ్లాగరూ రాత్రుళ్ళు నిద్రమానుకుని రాసి వాటిని ఇంటర్‌నెట్ సెంటర్లలో కూర్చుని టైప్ చేసి పోస్టు చేయడు. అప్పటి నా ఒంటరితనంలో ("isolation" is the right word) ఎవరైనా ఎక్కణ్ణించైనా సానుభూతితో నన్ను వినడం అత్యవసరమనిపించింది. సానుభూతి అంటే బాధల్ని చెప్పుకుంటే ప్రతిగా లభించేది కాదు (నాకలాంటి బాధలేం లేవు; ఉన్నా వాటి సంగతి నేను చూసుకోగలను/ గలిగాను); మరి ఎలాంటి సానుభూతో చెప్తాను:

నాకు రాయడంలో తప్ప మరెందులోనూ కనీస నైపుణ్యం లేదు. ఈ బ్లాగు మొదలుపెట్టక ముందు నుంచీ తెలుసు— రాత నా డెస్టినీ అని, నేను బాగా రాయగలననీ. అయితే—thanks to the thickly populated philistine world around me—ఈ రచన అనే వ్యాసంగపు విలువ పట్ల నాకు చాలా అనుమానాలుండేవి. ఆఫ్టరాల్ నేను ఫాక్టరీలో, ఫ్లైవోవర్లో, బహుళార్థ సాధక ప్రాజెక్టులో నిర్మించి జాతికి అంకితం ఇవ్వడం లేదు కదా; నేను వాక్యాలు నిర్మిస్తున్నానంతే. అసలు ఈ పనికి విలువ ఏమైనా ఉందా లేదా అనే అనుమానం ఉండేది. నాకున్న ఈ ఒకే ఒక్క నైపుణ్యం పట్ల అసలెవరికన్నా సానుభూతి ఉందా లేదా అన్న సందేహం పీడించేది. నా వరకూ ఈ సందేహం తీరితే చాలు, నా ఉనికి సమస్య తీరిపోయినట్టే అనిపించేది; నా అస్తిత్వానికి వత్తాసు దొరికినట్టేననిపించేది. అందుకే ఈ బ్లాగు ప్రారంభించాను. ఈ బ్లాగులో నేనేమీ గొప్ప రాతలు రాయలేదు, నాకు తెలుసు. కానీ రాయడం పట్ల నాకున్న passionని ఇందులో ప్రతిబింబింపజేయగలిగాను. ఆ passionకి అందరి నుండీ నేను ఆశించినదానికన్నా ఎక్కువ సానుభూతే లభించింది. తద్వారా నేనెన్నుకున్న వ్యాసంగానికి విలువ ఉందని నిరూపితమైంది. ఇక్కడి నా రాతలకి కొన్ని స్పందనల్ని నేనెప్పటికీ పదిలంగా దాచుకుంటాను. నిజానికి చాలా వాటికి ఉత్త "thank you"తో సరిపెట్టడం ఇష్టం లేక నేను సమాధానమే ఇవ్వలేదు. కాని, వాళ్ళెంత awkwardగా ప్రకటించినా సరే (mute admiration is more lovable than an eloquent one, I tell you), నా రచనలో ఏదో వాళ్ళను హత్తుకుందని అర్థమయ్యేది. ఈ సందర్భంగా నా "సరిహద్దుకిరువైపులా" కథకి వచ్చిన ఒక స్పందన ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను (ఈ ట్రోఫీ మాత్రం సొరుగులోనే ఎందుకు మగ్గిపోవాలని పోరే నా ప్రదర్శనాభిలాష వల్ల తప్ప, దీన్ని ఇక్కడ ఇవ్వడానికి వేరే కారణం ఏం లేదు):


ఈ కధ accidental గా చదివాను. ఇన్నాళ్ళు గా చూడనందుకు చాలా సంతోషంగా అనిపించింది.
ఎందుకంటే వేసవి రాత్రి నిద్రలో బాగా దాహం తో ఉండి కూడాబాటిల్ లో నీళ్లన్నీ ఖచ్చితంగా ఐపోయాయని తెలిసినప్పుడు అనుకోకుండా మంచంకింద నింపి పెట్టుకున్న ఒక రాగి చెంబుడు చల్లటి నీళ్ళ మాట గుర్తు రాగానేకలిగే ఆనందం అది.

పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన కధలు రాస్తే ఆ ఊహా శక్తి కి, పటిష్టం గాఎక్కడ డొల్లగా లేకుండా రాయగల సమర్ధత కి అసూయో, అపనమ్మకమో తెలియని భావం తో రకరకాలుగా అనుమానించటం ఏ సామన్యుడికైనా తప్పనిసరి.

అదలా ఉంచితే నేను మీకీ మైల్ ఎందుకు రాస్తున్నాను? పై అనుమానాల విషయాన్నిచెప్పటానికైతే ఖచ్చితం గా కాదు."మీ కధ బాగుంది, ఉపమానాలు, లోపలిప్రేరణలు, భావావేశాలు చక్కగా ఉపమానాలతో వర్ణించారు" అని చాలా చప్పగా, happy birthday to u అని ఒక రూపాయి ఖర్చుతో sms పంపినంత జీవం లేని విధంగా ఒక compliment ఇచ్చేసి పనయ్యింది అని సమాధానపడ్డానికి తప్ప ప్రపంచంలోని ఇన్ని భాష లూ మనిషికి ఏ ప్రయోజనమూ సాధించి పెట్టలేదేమో అనిపిస్తుందిఇలాంటప్పుడు.

ఈ కధ లో ఎంత మమేకమయ్యాను అంటే నేనేదైనా రాయటానికి ప్రేరణ పొందేంత.

you moved my lazy thoughts!!నాకిది ఎంత చదివినా తనివి తీరదు. ఇలాంటి స్పందనకు ఎలా ప్రతిస్పందించినా సరే వాళ్ళ అనుభూతిని మలినం చేసినట్టే అని నా కనిపిస్తుంది. అది మన రచనతో ఎవరో పాఠకుడు/ పాఠకురాలు ఏర్పరుచుకున్న అనుబంధం; మధ్యలో మనమెందుకు వెళ్ళాలనిపిస్తుంది. అందుకే ప్రతిస్పందించాలనిపించదు. ఇలాంటి స్పందనల వల్ల నా నైపుణ్యం పట్ల నాకు నమ్మకం కలిగిందని చెప్పను (నా రాతల్లో లోటుపాట్లు నాకు తెలుసు); కాని, రిలెటివ్‌గా చూస్తే ఒక ఫ్లైవోవర్‌కి ఎంత విలువ ఉందో, ఒక రసాత్మకమైన వాక్యానికి అంతకుమించి విలువుందన్న నమ్మకం నాకు కలిగింది. నా రాతలకు వచ్చిన స్పందనల్నే కాదు, వేరే బ్లాగుల్లో కొన్ని రాతలకి చదువరులు ప్రతిస్పందించిన తీరు, కొన్ని రాతలు నన్ను స్పందింపజేసిన తీరు. . . ఇవన్నీ నాకు రచనా వ్యాసంగానికి ఉన్న విలువ పట్ల నమ్మకాన్ని కలుగజేసాయి. ఈ విషయకంగా నేను బ్లాగ్ప్రపంచానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

చాలా మంది పేర్లు కూడా గుర్తుకు వస్తున్నాయి. నేను వాళ్ళతో ఎప్పుడూ మాట్లాడకపోయినా వాళ్ళు నాకు స్నేహితులనిపిస్తారు, అర్థం చేసుకోగలరనిపిస్తారు. నాకు చాలా మంది ఎలా ఉంటారో కూడా సరిగా తెలీదు, కాని ఆప్తులనిపిస్తారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడీ బ్లాగుని వదిలి వెళ్ళటమంటే ఏదో స్థలపరిమాణాలు గల ఆత్మీయమైన ప్రదేశాన్ని వదిలివెళ్ళడంలా ఉంది. అయినా వెళ్ళాలి. ఈ క్రమంలో నా వైపుగా వచ్చి నన్ను పలకరించిన వారందరికీ ధన్యవాదాలు. నేను వీడ్కోలు నెప్పుడూ ఒప్పుకోలేను. అందుకే ఆహ్వానాల్ని తిరస్కరిస్తాను. అలా ఇక్కడ ఎవర్నైనా నొప్పించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతూ శెలవు తీసుకుంటున్నాను.


మీ
ఫణి.

17 comments:

శేఖర్ పెద్దగోపు said...

అయ్యయ్యో .....ఎంత పని చేస్తున్నారండి? అసలు బ్లాగు ప్రపంచంలో మీలాంటి బ్లాగర్ల వల్లే బుర్ర లోపల వున్న ఆలోచనలని వచ్చీరాని తెలుగులో రాసేద్దమనే మా లాంటి వాళ్లు కొత్త బ్లాగులు మొదలు పెడుతుంటే అర్దాంతరంగా మీలాంటి వాళ్లు ఇలా.....
ఒక చిన్న సలహా..బ్లాగును డిలీట్ చెయ్యకుండా ప్రైవేటు చెయ్యండి. మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఆసక్తి కలిగినప్పుడు మొదలు పెట్టండి.
I never commented on your posts. But I follow this blog.

చిలమకూరు విజయమోహన్ said...

మీనిర్ణయాన్ని పునఃపరిశీలించుకోమని నా విజ్ఞప్తి.

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ said...

" సరిహద్దులకిరువైపులా " నన్నెంతో కదిలించిన కధ. అంత మంచి కధ రాసిన మీరు హటాత్తున ఇలా అస్త్ర సన్యాసం చేస్తాననడమేమీ బాగోలేదు.

కొత్త పాళీ said...

Very sorry to hear that.
You write well.
Wherever you go from here, keep writing.

Falling Angel said...

We'll miss you !

krishna rao jallipalli said...

మీ మనసుని ఎవరైనా నొప్పించారా?? అదే కనుక నిజమైతే పాఠకుల తరఫున క్షమాపణలు. లేక వేరే మీ పర్సనల్ కారణాలు ఉన్నాయా.. అయితే మీ ఇష్టం.

కత్తి మహేష్ కుమార్ said...

బ్లాగురాయడం మానినా, రాయటం మానకండి.

వికటకవి said...

You will be missed.

మధుర వాణి said...

ఫణీంద్ర గారూ..
నేను ఇప్పటిదాకా మీ బ్లాగు చూడకపోవడం దురదృష్టకరం.. కనీసం ఇవ్వాళైనా చూడగలగడం ఆనందించాల్సిన విషయం అనుకుంటాను. మీ టపా చదివాకా 'సరిహద్దుకిరువైపులా' అనే మీ కథ చదివి వచ్చాను ఇప్పుడే. నిజంగా ఎంత అద్భుతంగా రాశారండీ.. ముఖ్యంగా అమ్మాయి భావాలకు మీరిచ్చిన రూపం వాస్తవానికి చాలా చాలా దగ్గరిగా ఉంది. అంత చక్కగా ఊహించి రాయగలిగినందుకు మీకు అభినందనలు. ఇంకా మీ బ్ల్గౌలో మిగతావన్నీ కూడా త్వర త్వరగా చదివేయాలని ఉంది. కానీ.. మీరు బ్లాగు మూసేస్తున్నాని చెప్పడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. మీరు మూసేస్తే.. నాలాంటి కొత్త వారెంతోమంది మీ చక్కటి రాతల్ని మిస్ అయ్పోతారు కదండీ.. దయ చేసి మారు పునరాలోచించుకోకూడదూ..
అసలు మీరు రాసిన తెలుగు పదాలు ఎంత బావున్నాయండీ..నిజంగా తేనెలొలికే తెలుగు రుచి చూపించ్చారు. ఏది ఏమైనా.. దయ చేసి మరో సారి పాఠకుల అభ్యర్ధనను పరిశీలించగలరు.
ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

బొల్లోజు బాబా said...

you are a good inspiration to many of us as the first comment expresed.
it is unfortunate to here from you this.

నాగన్న said...

ఇన్నాళ్ళూ బ్లాగు రూపంలో మీరు తెలుగు సాహిత్యానికి మీరు చేసిన సేవలకు నా కృతజ్ఙతలు.

మనం ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వదిలేసినా మనల్ని మనం వదిలెయ్యలేం!. మన చిత్త వృత్తి మనం ఏది చేసినా అందులో తల దూరుస్తుంది. ఇవి రెండు చాలా ముఖ్యమైన విషయాలు.

ఇలా ఉత్తరం రాసి వెళ్ళిపోవడం అనే ఒక మానసిక ప్రక్రియ మిక్కిలి భయంకరమైనది. ఇక నుండైనా దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి.

appaji said...

ivala anukokundaa mee blog chusinanduku adrustavasattu analo,,anthalone idi chadivina tarvtha duradrustam anaalo teleedu kani intha chakkagaa rasi maa andariki andistunna meeku krutaznatalu..
evaro annattu dorikina vatithone trupthi chendalannattu..meeru raasina koddivatithone maa sahitya dahanni kontha varakainaa teerchukuntam...mee katha "sarihaddulaKIRUVAIPULA" ADBHUTAM...

అరుణ పప్పు said...

ఫణీంద్రా,
ఎందుకీ నిర్ణయం..?
జవాబు చెప్పాలా నీకు.. అంటే ఏమీ చెప్పలేను.
అడగాలా వద్దా అని ఉదయం నుంచీ ఆలోచిస్తున్నా మరి.
ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, మీ సృజనాత్మకతను, చదివే రాసే అలవాట్లనూ పోగొట్టుకోరనే నమ్ముతున్నా.
మీ నిర్ణయం గురించి నా బ్లాగులో పెట్టాను, దురుద్దేశాలేమీ లేవు, నానా రకాల చెత్తనంతా చదువుతున్న కొత్తవారికి మరో లోకాన్ని పరిచయం చెయ్యడమే.

రాధిక said...

మహేష్ గారి మాటే నాదీను.బ్లాగు మానినా రాయడం మానొద్దు.రాసింది పంచుకోవాలనిపిస్తే ఇక్కడ మీకు స్నేహితులున్నారని,వాళ్ళు మీ రాతలకై ఎదురుచూస్తుంటారని మర్చిపోకండి.

నాగరాజు said...

యే బేఖార్ దిల్ కా ఆసానా లిఖూ తో క్యా
యే దిల్ కా బాత్ నహీ కోయి టికాణా లిఖూ తో క్యా

ఎవరి పిచ్చి వాళ్ళ కానందం. వెళ్ళిరండి.

ఫణీంద్ర said...

అందరికీ ధన్యవాదాలు. బ్లాగు మూయడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. దీనికి బ్లాగ్ప్రపంచంతో అస్సలు ఏ సంబంధమూ లేదు. నేనెవరిపైనా కినుక వహించి మూసేయటం లేదు. అలాగే, చదివేవాళ్ళున్నారు కనుక దీనిని ఇప్పట్లో డిలీట్ చేయాలన్న ఉద్దేశ్యమూ లేదు. అయితే ఇందులో మాత్రం ఇక రాయను. బ్లాగు మానినా నేను రాయడం మానను.

కాస్త స్వీయ నియంత్రణ ఉంటే ఈ బ్లాగ్ మాధ్యమం ద్వారా చాలా చేయవచ్చు. చేస్తాను కూడా. కానీ ఇప్పుడు కాదు. ఇక్కడ కాదు.

అందరికీ మరోమారు ధన్యవాదాలు.

ఫణి

రాఘవ said...

మీరు బ్లాగు మూసేస్తున్నారూ అంటే "అయ్యో" అనిపించింది. మీ కారణాలు మీకు ఉన్నాయి అన్నారాయె, ఇంతకు మించి ఏమీ చెప్పలేను. వ్రాస్తూనే ఉండండి. శుభం భూయాత్.